*విచిత్ర వేషధారణలతో సమగ్ర శిక్షా ఉద్యోగుల భారీ నిరసన ప్రదర్శన*
హనుమకొండ జోర్దార్ ప్రతినిధి
హనుమకొండ పట్టణ వీధిలో నేడు ఎస్ఎస్ఏ ఉద్యోగులు నిరసన ప్రదర్శనలతో హోరెత్తించారు.
గత కొద్ది రోజులుగా రిలే నిరాహార దీక్షలు, నిరసన ప్రదర్శనలు చేపట్టిన ఉద్యోగులు నేడు విచిత్ర వేషధారణలతో బోనాలు ఎత్తి పట్టణ వీధిలో తమ డిమాండ్ల సాధన కొరకు నిరసనను ప్రకటించారు.
అమ్మవారి వేషధారణతో ఒక ఉద్యోగి ముందు నిలువగా మహిళలు బోనాలతో మరియు తమ డిమాండ్లతో కూడిన ప్లక్కార్డులు ప్రదర్శించి నినాదాలు చేసారు .తమ దీక్షా శిబిరం నుండి సమీప పోచమ్మ గుడి వరకు భారీ ర్యాలీ నిర్వహించి నిరసన ప్రదర్శన చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఎస్ఎస్ఏ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి తమను ఆదుకోవాలని కోరారు. గత 18 సంవత్సరాలుగా సేవలందిస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం సమాన పనికి సమాన వేతనం మాట మరచి తమ చాకిరిని గుర్తించకపోవడం శోచనీయమ ని పేర్కొన్నారు. కేజీబీవీ పాఠశాల ఉపాధ్యాయులు సైతం సమ్మెలో పాల్గొనడంతో ఆయా పాఠశాలలో విద్యాబోధన కుంటుపడుతోంది. ఎమ్మార్సీ కార్యాలయాల్లో పనులు నిలిచిపోయి పలు రిపోర్టులు సమర్పణ మరియు పాఠశాలల పర్యవేక్షణలకు ఆటంకం ఏర్పడుతోంది. ప్రభుత్వం ఇప్పటికైనా వారి డిమాండ్లపై సానుకూలంగా స్పందించి మాట నిలబెట్టుకోవాలని వివిధ ఉపాధ్యాయ ,విద్యార్థి ,ప్రజా సంఘాలు కోరుతున్నారు.
Leave a Reply