Advertisement

మానవ సమాజంపై అత్యంత ప్రభావం చూపిన ప్రపంచీకరణ

  • ఉత్తమ సమాజ నిర్మాణానికి అధ్యాపకులు కృషి చేయాలి
  • కాకతీయ యూనివర్సిటీ వైస్ చాన్స్ లర్ ప్రొఫెసర్ ప్రతాపరెడ్డి
  • ప్రపంచీకరణతో నైతిక, మానవీయ విలువలు మాయం
  • రాబోయే రెండు, మూడేళ్లలో వర్సిటీల్లో సమూల మార్పులు
  • వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
  • సోషియాలజీ అండ్ సోషల్ వర్క్ విభాగం ఆధ్వర్యంలో జాతీయ సదస్సు
  • హాజరైన దేశంలోని వివిధ యూనివర్సిటీల ఫ్రొఫెసర్లు, పరిశోధకులు

వరంగల్ జోర్ధార్ ప్రతినిధి:

తొంభయ్యవ దశకం తర్వాత నుంచి భారతదేశంలో అమలైన ప్రపంచీకరణ విధానాలు మానవ సమాజంపై అత్యంత ప్రభావం చూపాయని కాకతీయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కె. ప్రతాప్ రెడ్డి అన్నారు. ప్రపంచీకరణ పరిణామాలపై సోషియాలజీ విభాగంలో మరిన్ని పరిశోధనలు జరగాలని ఆకాంక్షించారు. కేయూ సెనేట్ హాల్ లో సోషియాలజీ అండ్ సోషల్ వర్క్ విభాగాధిపతి ప్రొఫెసర్ టి. శ్రీనివాస్ అధ్యక్షతన గ్లోబలైజేన్, డెవలప్ మెంట్ అండ్ సోషల్ ట్రాన్స్ ఫార్మేషన్ – మ్యాపింగ్ ది ట్రాజెక్టరీస్ ఆఫ్ సోషల్ ఇనిస్టిట్యూషన్స్ అండ్ ప్రాసెస్ ఇన్ కాంటెంపరరీ ఇండియా’ అనే అంశంపై నిర్వహిస్తున్న రెండు రోజుల జాతీయ సదస్సు గురువారం ప్రారంభమైంది. ఈ సదస్సు ప్రారంభ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రొఫెసర్ కె. ప్రతాపరెడ్డి మాట్లాడుతూ సమాజం వ్యక్తి నుంచి సమూహంగా, సమూహం నుంచి సమాజంగా పరిణామక్రమం చెందిందని, ఇప్పుడు సమాజానికి సాంకేతికత తోడవ్వడం చూస్తున్నామని తెలిపారు. సమాజ పరిణామ క్రమంపై సోషియాలజీ అండ్ సోషల్ వర్క్ విభాగంలో మరిన్ని పరిశోధనలు చేయాలని, యూనివర్సిటీకి పూర్వ వైభవాన్నితీసుకురావాలని కోరారు. ఉత్తమ సమాజ నిర్మాణానికి అధ్యాపకులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ప్రత్యేక అతిథిగా హాజరైన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ నైతిక విలువలు, మానవీయ విలువలు ప్రపంచీకరణతో మాయమయ్యాయని తెలిపారు. కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమవుతోందని, మానవ సంబంధాలపై అత్యంత ప్రభావం చూపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచీకరణ – మానవ సంబంధాలపై మరిన్ని పరిశోధనలు జరగాలని ఆకాంక్షించారు. యూనివర్సిటీలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, రాబోయే రెండు, మూడేళ్లలో గొప్ప మార్పులు జరుగుతాయని తెలిపారు.

ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ కే. శ్రీనివాసులు తన కీలకోపన్యాసం చేస్తూ ప్రపంచీకరణ కేవలం ఆర్థిక వ్యవస్థ మీదనేగాక అన్ని రంగాలపై అత్యంత ప్రభావం చూపిందన్నారు. వలసవాదులు వల్ల గ్రామీణ భారతం విచ్చిన్నమైందని తెలిపారు. రాజ్యం కేంద్రంగా కాకుండా మార్కెట్ కేంద్రంగా వ్యవస్థ ప్రపంచీకరణతో మారిందన్నారు. అవీనితి పెరిగిందని,, లాభం, లాభదాయకతే ప్రాధాన్యమైందన్నారు.

జాతీయ సదస్సులో కేయూ సోషియాలజీ డిపార్ట్ మెంట్ ఫౌండర్ ఫ్రొఫెసర్ ఎన్.రాములు, ఎకానమిక్స్ రిటైర్డ్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ, ఎస్వీ యూనివర్సిటీ ప్రొఫెసర్లు డి.వెంకటేశ్వర్లు, ఆచార్య హనుమంత రావు, ఓయూ ప్రొఫెసర్లు సి. గణేష్, ఆచార్య అడపా సత్యనారాయణ తో పాటు కేయూ సోషల్ సైన్సెస్ డీన్ ప్రొఫెసర్ టి. మనోహర్, క్యాపంస్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బి. సురేష్ లాల్, యూజీసీ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఆర్. మల్లికార్జున రెడ్డి, సోషియాలజీ అండ్ సోషల్ వర్క్ విభాగం అధ్యాపకులు ప్రొఫెసర్ కుంట అయిలయ్య, ప్రొఫెసర్ ఎం.స్వర్ణలత, డాక్టర్ సుభాష్, డాక్టర్ ఎస్.సాహితి, బోధన, బోధనేతర సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు. జాతీయ సదస్సులో సమర్పించబోయే పరిశోధన పత్రాల ఆబ్ స్ట్రాక్ట్ ను అతిథులు ఆవిష్కరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *