Advertisement

కాకతీయ విశ్వవిద్యాలయంలో అంబేద్కర్ వర్ధంతి వివాదం – విద్యార్థి సంఘాల ఆగ్రహం….

అంబేద్కర్ వర్ధంతిని మరిచిన కేయూ అధికారులు….?
కేయూ రిజిస్ట్రార్ మల్లారెడ్డి పై విద్యార్థి సంఘాల ఆగ్రహం….
‘గో బ్యాక్ రిజిస్ట్రార్’ అంటూ నినాదాలు….
గంట సేపు నెలకొన్న ఉత్కంఠ….
కాకతీయ విశ్వవిద్యాలయంలో అంబేద్కర్ వర్ధంతి వివాదం – విద్యార్థి సంఘాల ఆగ్రహం….
క్షమాపణలు చెప్పిన రిజిస్ట్రార్…

(డిసెంబర్ 7, జోర్ధార్ వరంగల్ ప్రతినిధి) :

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వర్ధంతిని మరిచిన కాకతీయ విశ్వవిద్యాలయం అధికారులు విద్యార్థి సంఘాల నిరసనలకు కారణమయ్యారు. ప్రతి ఏడాది అధికారికంగా నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం నిర్వీర్యం చేయడం, యూనివర్సిటీ రిజిస్ట్రార్ మల్లారెడ్డి నిర్లక్ష్యం స్పష్టంగా బయటపడింది. అంబేద్కర్ ఆశయాలను పాటించడంలో వైఫల్యం చూపుతున్న యూనివర్సిటీ పాలనపై విద్యార్థి సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి.

అంబేద్కర్ వర్ధంతిని విస్మరించిన యూనివర్సిటీ…

ప్రతి ఏడాది యూనివర్సిటీ ఎస్సీ/ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఎస్.డీ.ఎల్.సీ.ఈ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన ఆశయాలను గుర్తు చేసుకునే ఈ కార్యక్రమానికి ఈ ఏడాది ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు చేయలేదు. ఉదయం 11 గంటల వరకు యూనివర్సిటీ నుండి ఎటువంటి సర్కులర్ విడుదల కాకపోవడం, అధికారులు అలక్ష్యంగా వ్యవహరించడం విద్యార్థుల్లో తీవ్ర అసంతృప్తి రేపింది.

విద్యార్థి సంఘాల ఆందోళన…

ఉదయం 10 గంటలకు ఎస్.డీ.ఎల్.సీ.ఈ వద్దకు చేరుకున్న విద్యార్థి సంఘాల నాయకులు కార్యక్రమం కోసం ఎదురు చూసినప్పటికీ, అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో ఆందోళనకు దిగారు. రిజిస్ట్రార్ మల్లారెడ్డి 11:45 గంటలకు హడావిడిగా అక్కడికి చేరుకున్నప్పుడు, విద్యార్థులు “గో బ్యాక్ రిజిస్ట్రార్”, “మల్లారెడ్డి రాజీనామా చేయాలి”, “అంబేద్కర్ ద్రోహి” వంటి నినాదాలతో ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల నిరసన కారణంగా రిజిస్ట్రార్ దాదాపు గంట పాటు పూలమాల వేసేందుకు విఫలమయ్యారు.

గతంలో ఒకసారి ఇదే తంతు…

గతంలో ఒకసారి కూడా కేయూ అధికారులు ఇదే తీరు చూయించారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఎస్సీ.ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించాల్సి వుండగా అంబేద్కర్ విగ్రహానికి పూల దండలు వేసే సమయంలో సరైన సంఖ్యలో దండలు లేకపోవడంతో అందరూ అవాక్కయ్యారు. ఎస్సీ,ఎస్టీ సెల్ డైరెక్టర్ ను వీసీ రిజిస్ట్రార్ లు ప్రశ్నించగా వెంటనే ఒక సీనియర్ ప్రొఫెసర్ దండలు తీసుకురావడంతో అప్పటి మాజీ వీసీ రమేష్, రిజిస్ట్రార్, ఇతర కొందరు సీనియర్ ప్రొఫెసర్లు అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఆ తర్వాత కొన్ని రోజులకు సెల్ డైరెక్టర్ ను మార్చారు.

విద్యార్థి సంఘాల నాయకులు ఈ సందర్భంగా మాట్లాడుతూనే, యూనివర్సిటీ ఉన్నతాధికారులు అంబేద్కర్ ఆశయాలను పాటించడంలో విఫలమయ్యారని తీవ్ర విమర్శలు చేశారు. డాక్టర్ అంబేద్కర్ ఆశయాలైన సామాజిక సమానత్వం, విద్యా హక్కు, మరియు నైతిక విలువల ప్రాముఖ్యతను గౌరవించాల్సిన యూనివర్సిటీ పాలకులు వాటిని విస్మరిస్తున్నారని ఆరోపించారు.

విద్యార్థి సంఘాల డిమాండ్లు….

ఈ ఘటన అనంతరం విద్యార్థి సంఘాలు కేయూ అధికారులపై తీవ్ర విమర్శలు చేస్తూ, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. అంబేద్కర్ ఆశయాలను పాటిస్తూ, ఆయన పేరున జరిగే ప్రతి కార్యక్రమాన్ని సముచితంగా నిర్వహించేందుకు యూనివర్సిటీ పాలన మార్గదర్శకాలను అమలు చేయాలని విద్యార్థి సంఘాల నేతలు స్పష్టం చేశారు.

ఈ ఘటన యూనివర్సిటీ పరిపాలనపై తీవ్ర విమర్శలకు దారితీసింది. అంబేద్కర్ ఆశయాలను గౌరవించడంలో విఫలమైన ఈ నిర్లక్ష్యపూరిత వ్యవహారాన్ని విద్యార్థులు తీవ్రంగా ఖండించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *