*మడకలో ప్రభుత్వ భూమిని రక్షించండి: జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి అర్ధ నగ్న నిరసన*
*జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అర్థ నగ్నంగా విజ్ఞప్తి సమర్పించిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి గోశిక రాజేశం*
పెద్దపల్లి జోర్దార్ ప్రతినిధి
పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించిన సందర్భంగా మడక గ్రామానికి చెందిన జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి గోశిక రాజేశం అర్ధనగ్న ప్రదర్శనతో అధికారులకు విజ్ఞప్తి సమర్పించడం కలకలం రేపింది.
వివరాల్లోకి వెళితే… ఓదెల మండలంలోని మడక గ్రామంలో సుమారు 10 ఎకరాల ప్రభుత్వ భూమి దురాక్రమణకు గురైందని గతంలో అధికారులకు ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా వారు పట్టించుకోలేదని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గోషిక రాజేశం ఆరోపించారు.ఇటీవల తాము రెవెన్యూ మంత్రికి ఫిర్యాదు చేయగా వారి ఆదేశానుసారం స్థానిక రెవిన్యూ యంత్రాంగం సర్వే జరిపి దురాక్రమణకు గురైన భూమిలో హద్దురాల్లను ఏర్పరిచిందని తెలిపారు. అయితే ఆక్రమణదారులు హద్దులను చెరిపివేసి యదేచ్ఛగా ప్రభుత్వ భూమిని కబ్జా చేసి సాగు చేస్తున్నారని, ఈ విషయమై స్థానిక తాసిల్దార్ మరియు కలెక్టర్ కు విజ్ఞప్తి చేసినా వారు పట్టించుకోకపోవడంతో ఈరోజు అర్ద నగ్నంగా నిరసన ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ కు మరొకసారి విజ్ఞప్తి సమర్పించానని తెలిపారు. ఒకవైపు ప్రభుత్వం దురాక్రమణలు నిరోధించాలని అత్యంత చిత్తశుద్ధితో హైడ్రా తరహా చర్యలు చేపడితే స్థానిక రెవిన్యూ యంత్రాంగం మాత్రం భూ కబ్జాదారులకు సహకరించి నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తుందని వాపోయారు. స్థానిక ప్రభుత్వ యంత్రాంగం అసమర్థత ఫలితంగా మడక గ్రామంలో కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం జరుగుతోందని, ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే ప్రభుత్వ ఆస్తులను రక్షించాలని ఆయన కోరారు.
Leave a Reply